వైభవంగా శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు.. మే 28 నుంచి జూన్ 5 వరకు దివ్యోత్సవాలు

నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28 నుండి జూన్ 5 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర బుధవారం తిరుపతిలోని ఈవో నివాస గృహంలోని కార్యాలయంలో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఈవో, భక్తులకు దివ్యానుభూతి కలిగేలా అన్ని శాఖలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.

మే 24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 27న అంకురార్పణం నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 4న స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగనుందని వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలు సాంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిర్వహించాలన్నారు. వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ, చలువ పందిళ్లు, వైట్ పెయింటింగ్‌, విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, రంగోలీలు, సాంప్రదాయ చిత్రకళా అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామివారు, అమ్మవారు వివిధ దివ్య వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి:

  • మే 28 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం
  • మే 29 – చిన్నశేష వాహనం, హంస వాహనం
  • మే 30 – సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం
  • మే 31 – కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం
  • జూన్ 1 – మోహినీ అవతారం, గరుడ వాహనం
  • జూన్ 2 – హనుమంత వాహనం, గజ వాహనం
  • జూన్ 3 – సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం
  • జూన్ 4 – రథోత్సవం, అశ్వవాహనం, కల్యాణోత్సవం
  • జూన్ 5 – చక్రస్నానం, ధ్వజావరోహణం

జూన్ 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు జరిగే శ్రీ స్వామివారి కల్యాణోత్సవానికి భారీగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, ప్రసాదాల పంపిణీ, కూర్చునే సదుపాయాలు, భద్రతా చర్యలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయాల డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button