శ్రీవాణి టికెట్లపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం.. అసలు నిజాలు వెల్లడించిన టీటీడీ

శ్రీవాణి టికెట్లు, టీటీడీ ఐటీ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా వాస్తవాలకు విరుద్ధమని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులకు పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా శ్రీ‌వాణి ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించింది.

టీటీడీ తెలిపిన వివరాల ప్రకారం టీసీఎస్ సహకారంతో 2019 మే నెలలో ప్రారంభించిన ఆన్‌లైన్ శ్రీ‌వాణి టికెట్ విధానాన్నే ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. భక్తుల అభ్యర్థన మేరకు తిరుమలలో ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేసే విధానాన్ని తొలగించి పూర్తిగా ఆన్‌లైన్ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ విధానంలో ముందుగా సాఫ్ట్‌వేర్‌ను యాక్సెస్ చేసిన వారికి ముందుగా టికెట్లు లభించేలా వ్యవస్థ రూపొందించబడిందని తెలిపింది. రోజుకు వేల సంఖ్యలో భక్తులు టికెట్ల కోసం ప్రయత్నిస్తుండటంతో మొదటి ఒకటిన్నర నిమిషంలోనే టికెట్లు లాక్ అవుతున్నాయని వెల్లడించింది.

పేమెంట్ గేట్‌వే ద్వారా విజయవంతంగా చెల్లింపులు పూర్తిచేసిన వారికి మాత్రమే టికెట్లు జారీ అవుతాయని, చెల్లింపులు విఫలమైతే ఆ టికెట్లు తిరిగి పూల్‌లోకి చేరి ఇతర భక్తులకు అందుబాటులోకి వస్తాయని టీటీడీ వివరించింది. ఇదే విధానం ఐఆర్‌సీటీసీతో పాటు ఇతర ప్రభుత్వ అడ్వాన్స్ బుకింగ్ సేవల్లో కూడా అమల్లో ఉందని తెలిపింది.

పది నిమిషాల తర్వాత టికెట్లు అందుబాటులోకి రావడం సాంకేతిక ప్రక్రియలో భాగమేనని టీటీడీ పేర్కొంది. పేమెంట్ సమయంలో సాంకేతిక సమస్యలు లేదా చెల్లింపు ధృవీకరణలో ఆలస్యం జరిగితే అటువంటి టికెట్లు మళ్లీ భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి సాఫ్ట్‌వేర్ రూపొందించబడిందని వెల్లడించింది.

జీఎం ఐటీగా కనీస అర్హతలు లేని వ్యక్తిని నియమించారన్న ఆరోపణలను కూడా టీటీడీ ఖండించింది. సంబంధిత అధికారికి ఎం.టెక్ (కంప్యూటర్ సైన్స్), ఎం.ఎస్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్) అర్హతలతో పాటు 32 ఏళ్ల ఐటీ అనుభవం ఉందని తెలిపింది. స్టాప్ గ్యాప్ అరేంజ్‌మెంట్ కింద మాత్రమే జీఎం ఐటీ ఎఫ్ఏసీగా నియమించామని పేర్కొంది.

టీసీఎస్ కొత్త సాఫ్ట్‌వేర్ తీసుకురాలేదని, 2019లో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కే భక్తుల సూచనల మేరకు కాలానుగుణంగా మార్పులు చేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.

భక్తులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు ఆటో ఫిల్లింగ్‌, కాపీ-పేస్ట్ విధానాలను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే టీటీడీ ఐటీ వ్యవస్థలను ప్రతి సంవత్సరం ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా ఆడిట్ చేయిస్తున్నట్లు వెల్లడించింది.

ఇటీవల మాజీ టీటీడీ చైర్మన్ ప్రదర్శించిన శ్రీ‌వాణి టికెట్ బుకింగ్ ప్రక్రియపై కూడా టీటీడీ స్పందించింది. వారు పేమెంట్ గేట్‌వే దశ వరకు వెళ్లారని, కానీ ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో ట్రాన్సాక్షన్ తిరస్కరించబడిందని పేర్కొంది. అనంతరం మళ్లీ ప్రయత్నించడంతో అది కొత్త ప్రయత్నంగా పరిగణించబడిందని, అప్పటికే ఇతర భక్తులు ముందుకు వెళ్లడంతో వారు వెయిటింగ్‌లో వెనుకబడ్డారని టీటీడీ వివరణ ఇచ్చింది.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button