తిరుపతి జిల్లాలో “డ్రగ్స్ పై దండయాత్ర–2.0”.. 300 మందికి డ్రగ్ టెస్టులు..

తిరుపతి జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పోలీసులు చేపట్టిన “డ్రగ్స్ పై దండయాత్ర–2.0” కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. “పరీక్ష చేద్దాం – మత్తును వదిలిద్దాం” అనే నినాదంతో నిర్వహించిన ప్రత్యేక అవగాహన మరియు డ్రగ్ డిటెక్షన్ కార్యక్రమంలో వందలాది మందికి పరీక్షలు నిర్వహించి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ శ్రీ హరీశ్ కుమార్ గుప్తా, ఐపీఎస్., ఆదేశాలు, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు ఎస్పీ (క్రైమ్స్) శ్రీ ఆర్ల శ్రీనివాసరావు నేతృత్వంలో, రేణిగుంట సబ్-డివిజన్ పోలీసు అధికారి శ్రీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి.

ఈ సందర్భంగా రైల్వేకోడూరు పట్టణంలోని మామిడికాయల మార్కెట్ ప్రాంతం మరియు ఓబులవారిపల్లి మండలంలోని ఏపీఎండీసీ ప్రాంతం, మంగంపేట వద్ద ప్రత్యేక డ్రగ్ అవగాహన శిబిరాలు నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన డ్రగ్ డిటెక్షన్ బస్సు ద్వారా గంజాయి వినియోగాన్ని గుర్తించే ఆధునిక పరీక్షా కిట్ల సహాయంతో తనిఖీలు చేపట్టారు.

రైల్వేకోడూరు మామిడికాయల మార్కెట్ ప్రాంతంలో సుమారు 150 మందికి, ఓబులవారిపల్లి మండలంలోని మంగంపేట ప్రాంతంలో మరో 150 మందికి గంజాయి గుర్తింపు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 300 మందికి పైగా ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.

పోలీసు అధికారులు మాట్లాడుతూ, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం, నిల్వ, సరఫరా, అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశారు. సమాజాన్ని మత్తు రహితంగా మార్చేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ప్రజలు తమ పరిసరాల్లో మాదకద్రవ్యాల వినియోగం లేదా అక్రమ రవాణా జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు, రైల్వేకోడూరు టౌన్ సీఐ శ్రీ చంద్రశేఖర్, కోడూరు రూరల్ సీఐ శ్రీ డి. శ్రీనివాసులు, టౌన్ ఎస్‌ఐ శ్రీ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, ఓబులవారిపల్లి ఎస్‌ఐ శ్రీ పి. మహేష్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.
Back to top button