సత్యవేడు పోలీస్ స్టేషన్‌పై జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ.. నైట్ బీట్స్, చెక్‌పోస్టులపై కీలక ఆదేశాలు

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు, నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., సత్యవేడు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో అమలవుతున్న పోలీసింగ్ విధానాలను సమగ్రంగా సమీక్షించారు.

పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కార విధానం, నేర నియంత్రణ చర్యలపై అధికారులను ఎస్పీ ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్ రికార్డులు, కేసు ఫైళ్లు, విజిటర్ రిజిస్టర్లు, ఎఫ్‌ఐఆర్ నమోదు విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను శ్రద్ధగా విని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా బాధితులకు ధైర్యం చెప్పి, న్యాయం జరిగేలా పనిచేయాలని పోలీస్ సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా నైట్ బీట్ వ్యవస్థ అమలు తీరును కూడా సమీక్షించారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బార్డర్ చెక్‌పోస్టుల వద్ద జరుగుతున్న తనిఖీలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు.

రోడ్డు భద్రత చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాద నివారణ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్పీ సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పహారా నిర్వహించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని ఎస్పీ దిశానిర్దేశం చేశారు.

ఈ తనిఖీలో సత్యవేడు సీఐ, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.
Back to top button