తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణకు టీటీడీ ప్రత్యేక చర్యలు.. భారీ భక్తుల రద్దీ మధ్య పరిశుభ్రతపై ఫోకస్

వేసవి సెలవులు, వారాంతాలు, ప్రత్యేక దర్శనాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల కోసం సుమారు 210 మరుగుదొడ్లు అందుబాటులో ఉండగా, అదనంగా 130 సంస్థాగత మరుగుదొడ్లను కూడా టీటీడీ నిర్వహిస్తోంది. ప్రతి మరుగుదొడ్డి వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి గంట గంటకూ శుభ్రపరిచే విధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) అమలు చేస్తున్నారు.
పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపర్చేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించడంతో పాటు రసాయనాలు, డిసిన్ఫెక్టెంట్ల వినియోగంపై అవగాహన కల్పించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లోని మరుగుదొడ్లను రోజుకు 1,500 నుంచి 2,000 మందికి పైగా వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

రోడ్ల పరిశుభ్రత విషయంలో కూడా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రియల్ టైమ్ రోడ్ స్వీపింగ్, చెత్త సేకరణ, నీటి స్ప్రే వంటి పనులు నిరంతరం కొనసాగుతున్నాయి. ఆకులు రాలే కాలంలో కూడా పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరంగా శ్రమించి తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
ఇటీవల భక్తుల రద్దీ పెరగడంతో బాహ్య క్యూ లైన్లలో అన్నప్రసాదాల పంపిణీ ఎక్కువగా జరుగుతోంది. అయితే కొంతమంది భక్తులు ఆహార పదార్థాలను పూర్తిగా వినియోగించకుండా పారవేయడంతో ఆహార వ్యర్థాలు అధికంగా పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో క్యూ లైన్ల వెనుక భాగాల్లో చెత్త ఎక్కువగా చేరుతోందని అధికారులు గుర్తించారు.
కొండ ప్రాంత భౌగోళిక పరిస్థితులు, గోతులు, స్లోప్ ప్రాంతాలు, డ్రైనేజీ మార్గాలు, రాత్రివేళల్లో పాముల సంచారం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పారిశుద్ధ్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రతి ఉదయం ప్రత్యేక శుభ్రత చర్యలు చేపట్టి చెత్త తొలగింపుతో పాటు బ్లీచింగ్ చల్లడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సాధారణ రోజుల్లో 50 టన్నుల వరకు ఉండే తడి వ్యర్థాలు ప్రస్తుతం 60 నుంచి 75 టన్నుల వరకు పెరిగినట్లు టీటీడీ తెలిపింది. డ్రై వేస్ట్ పరిమాణం కూడా గణనీయంగా పెరిగినా, అందుబాటులో ఉన్న సిబ్బందితోనే పారిశుద్ధ్య విభాగం సమర్థవంతంగా పనిచేస్తోంది.
తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు పరిశుభ్రతలో భాగస్వామి కావాలని, ఆహార పదార్థాలను వృథా చేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.





