మహారాష్ట్రలో విషాదం.. తునికాకు సేకరణకు వెళ్లిన మహిళలపై పులి దాడి, నలుగురు మృతి

మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అడవికి తునికాకు సేకరించేందుకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి చేయడంతో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన చంద్రాపూర్ జిల్లాలోని సిందేవాహి తహసీల్ పరిధిలోని గుంజవాహి ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగింది.
స్థానిక సమాచారం ప్రకారం, గుంజవాహి గ్రామానికి చెందిన మహిళలు ప్రతిరోజులాగే జీవనోపాధి కోసం సమీప అటవీ ప్రాంతానికి తునికాకులు సేకరించేందుకు వెళ్లారు. మహిళలు అడవిలో పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో పొదల్లో మాటువేసి ఉన్న పులి ఒక్కసారిగా వారిపై దాడి చేసింది.
అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో మహిళలు తీవ్రంగా గాయపడగా, నలుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పులి సంచారం నేపథ్యంలో గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ హెచ్చరించింది. అడవికి వెళ్లే ప్రజలు గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. ప్రాంతంలో పులి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ ఘటనతో చంద్రాపూర్ జిల్లా పరిసర గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అడవిపై ఆధారపడి జీవనం సాగించే ప్రజలు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





