రౌడీయిజంపై విజయనగరం పోలీసుల ఉక్కుపాదం.. బేత లల్లూపై పీడీ యాక్ట్ అమలు

విజయనగరం జిల్లాలో రౌడీయిజం, చైన్ స్నాచింగ్, గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వరుసగా నేరాలకు పాల్పడుతూ ప్రజలకు భయాందోళనలు సృష్టిస్తున్న రౌడీ షీటర్ బేత లల్లూపై జిల్లా పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేశారు.

విజయనగరం పట్టణంలోని శివాలయం వీధికి చెందిన బేత లల్లూ (23) గత కొన్నేళ్లుగా గంజాయి అక్రమ రవాణా, చైన్ స్నాచింగ్, దొంగతనాలు వంటి అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నేర ప్రవృత్తిని విడనాడకుండా వరుసగా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం 2023 నుంచి ఇప్పటివరకు బేత లల్లూపై రెండు గంజాయి కేసులు, ఒక నైట్ దొంగతనం కేసు, మూడు సాధారణ దొంగతనం కేసులు, ఒక చైన్ స్నాచింగ్ కేసు నమోదయ్యాయి. మొత్తం ఏడు కేసుల్లో అతను అరెస్టయ్యాడు.

ఇప్పటికే విజయనగరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అతనిపై సస్పెక్ట్ షీట్ కూడా కొనసాగుతోంది. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పాటు ప్రజల భద్రత, శాంతిభద్రతలకు ముప్పుగా మారాడని పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ముందస్తు నేర నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా పోలీసులు అతనిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. అనంతరం అతడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నిర్బంధం ఒక సంవత్సరం వరకు అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. ఇటీవల జిల్లాలో పలువురు రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించినట్లు చెప్పారు.

నేరాలకు పాల్పడుతున్న వ్యక్తుల ఇళ్ల వద్దకే వెళ్లి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారని, నేర ప్రవృత్తిని విడిచిపెట్టకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బేత లల్లూపై పీడీ యాక్ట్ అమలు చేయడం జిల్లాలోని రౌడీ షీటర్లలో భయాందోళనలు కలిగిస్తోంది.

జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. గంజాయి, మాదకద్రవ్యాల రవాణా, చైన్ స్నాచింగ్, దోపిడీలు, భూదురాక్రమణలు వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button