తిరుపతిలో శక్తి టీమ్ అవగాహన కార్యక్రమం.. మహిళల భద్రత, సైబర్ మోసాలపై కీలక సూచనలు

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బారాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీమతి శ్రీలత ఆధ్వర్యంలో శక్తి టీమ్ మహిళా పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం తిరుపతిలోని సంస్కృత విద్యా పీఠం సెక్యూరిటీ సిబ్బందికి ప్రత్యేకంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళల భద్రత, అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ సేవలను ఎలా వినియోగించుకోవాలి, శక్తి యాప్ ద్వారా తక్షణ సహాయం ఎలా పొందాలి అనే అంశాలపై సిబ్బందికి అవగాహన కల్పించారు.

శక్తి యాప్ వినియోగం ద్వారా మహిళలు ప్రమాద సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం అందించవచ్చని తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ మహిళల భద్రత కోసం అందిస్తున్న టోల్ ఫ్రీ నంబర్లు, భద్రతా సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అలాగే ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలు, ఫేక్ లోన్ యాప్ మోసాలు, ఓటీపీ ఫ్రాడ్లు, ఆన్‌లైన్ మోసాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్, లింకులు, మెసేజ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. సమాజ భద్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.

అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని వివరించారు.

ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పోలీసులు పేర్కొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button