ట్యాక్స్ కట్టలేదని ఫంక్షన్ హాల్ ముందు చెత్త డంప్.. పుంగనూరులో మున్సిపల్ అధికారుల వినూత్న చర్య

అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ అధికారులు చేపట్టిన వినూత్న చర్య ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యూజర్ ట్యాక్స్, బల్క్ వేస్టేజ్ ఛార్జీలు చెల్లించకుండా మొండికేస్తున్న ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యానికి మున్సిపల్ సిబ్బంది ఊహించని షాక్ ఇచ్చారు. ఏకంగా ఫంక్షన్ హాల్ ప్రధాన గేటు ముందే భారీగా చెత్తను డంప్ చేసి బకాయిలు వసూలు చేశారు.
పుంగనూరులోని విబిఎస్ ఫంక్షన్ హాల్ యాజమాన్యం చాలా కాలంగా మున్సిపాలిటీకి చెల్లించాల్సిన యూజర్ ట్యాక్స్, బల్క్ వేస్టేజ్ తొలగింపు ఛార్జీలను చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ బకాయిల విషయమై పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ యాజమాన్యం స్పందించలేదని వెల్లడించారు.
నిబంధనల ప్రకారం ఫంక్షన్ హాల్‌లో వివాహాలు, శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఏర్పడే వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపాలిటీకి రూ.300 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే సదరు ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఎలాంటి చార్జీలు చెల్లించకుండా చెత్తను రోడ్డుపై పడేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇంతకాలం మున్సిపల్ సిబ్బందే ఆ చెత్తను తొలగిస్తూ వచ్చారని అధికారులు తెలిపారు. అయినప్పటికీ యాజమాన్యం బకాయిలు చెల్లించకపోవడంతో చివరకు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది భారీగా చెత్తను ట్రాక్టర్లలో తీసుకెళ్లి ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం ముందు డంప్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో దుర్వాసన వ్యాపించి స్థానికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఫంక్షన్ హాల్‌కు వచ్చే వారూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ ఘటనతో స్థానికంగా పెద్ద చర్చ మొదలైంది. కొందరు మున్సిపల్ అధికారుల చర్యను సమర్థిస్తూ “ఎన్నిసార్లు చెప్పినా పన్నులు కట్టకపోతే ఇలాగే చేయాలి” అని అభిప్రాయపడగా, మరికొందరు మాత్రం ఇలాంటి చర్యల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని విమర్శించారు.
అయితే పరిస్థితి తీవ్రతను గుర్తించిన ఫంక్షన్ హాల్ యాజమాన్యం చివరకు దిగివచ్చి పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలను చెల్లించినట్లు సమాచారం. బకాయిలు చెల్లించగానే మున్సిపల్ సిబ్బంది అక్కడి చెత్తను తొలగించారు.
పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసే వారిపై ఇకపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం పుంగనూరులో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హాట్ టాపిక్‌గా మారింది.





