వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు.. మే 27న గరుడసేవ, 30న రథోత్సవం

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది మే 23 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా ఆలయ పరిసరాలను ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర తెలిపారు.

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను శనివారం తిరుపతిలోని టీటీడీ ఈవో నివాస గృహంలోని ఛాంబర్‌లో జేఈవోలు శ్రీ వి వీరబ్రహ్మం, డా. ఎ. శరత్‌, సివిఎస్వో శ్రీ కే వి మురళీకృష్ణ సమక్షంలో ఈవో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, చలువ పందిళ్లు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

ఆలయ పరిసరాలను రంగురంగుల ముగ్గులు, పుష్పాలంకరణలు, విద్యుత్ దీపాల అలంకరణలు, వైట్ పెయింటింగ్‌, సాంప్రదాయ చిత్రకళా అలంకరణలు, ఎల్‌ఈడీ స్క్రీన్లతో సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.

మే 22న సాయంత్రం 5.30 గంటల నుండి 8 గంటల వరకు అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మే 23న ఉదయం 7.35 గంటల నుండి 8.49 గంటల వరకు మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ప్రతిరోజూ ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహించనున్నారు. ఇందులో మే 27న జరిగే గరుడ వాహన సేవ, మే 30న నిర్వహించే రథోత్సవం ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.

వాహనసేవల షెడ్యూల్ ఇలా ఉంది:

24.05.2026 – ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనం

25.05.2026 – ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపుపందిరి వాహనం

26.05.2026 – ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం

27.05.2026 – ఉదయం మోహినీ అవతారం, రాత్రి గరుడ వాహనం

28.05.2026 – ఉదయం హనుమంత వాహనం, రాత్రి గజ వాహనం

29.05.2026 – ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం

30.05.2026 – ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం

31.05.2026 – ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ భక్తి సంగీత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్. శాంతి, ఏఈవో శ్రీ ఏబీ నారాయణ చౌదరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button