
శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణ పనులను సమీక్షించిన టీటీడీ జేఈవో
తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆరోగ్యం, విద్య) డాక్టర్ ఎ. శరత్ సమీక్షించారు. బుధవారం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి ఆయన నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు జూలై 31 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఆసుపత్రిలో ప్రతి అంతస్తుకు సంబంధించి వైద్య సదుపాయాలు, ఎలక్ట్రికల్ వ్యవస్థలు, ఎయిర్ కండిషనింగ్, కంప్యూటర్ నెట్‌వర్క్, రోగుల అవసరాలకు సంబంధించిన పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
విభాగాల మధ్య సమన్వయం పెంచి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణ పనుల పురోగతిపై క్రమం తప్పకుండా నివేదికలు అందించాలని చెప్పారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ఎన్. శ్రీనాథ్ రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు మరియు ఇతర టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు.




