తిరుమలలో ఆపరేషన్ వజ్రపహార్.. 62 షాపుల తనిఖీ, 8 మంది అనుమానితులు అదుపులోకి

తిరుమలలో భక్తుల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు క్షేత్ర పవిత్రతను పరిరక్షించే లక్ష్యంతో పోలీసులు “ఆపరేషన్ వజ్రపహార్” పేరుతో ప్రత్యేక నాఖాబందీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అలిపిరి నడక మార్గంలో ఉన్న పలు షాపులను పరిశీలించగా, సరైన గుర్తింపు పత్రాలు లేని పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు, చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ మురళీకృష్ణ ఐపీఎస్ మార్గదర్శకత్వంలో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తిరుమల డీఎస్పీ పర్యవేక్షణలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు అలిపిరి నడక మార్గంలోని జీఎన్సీ టోల్‌గేట్ నుంచి మోకాలి మిట్ట గోపురం వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఈ ఆపరేషన్‌లో పోలీస్, టీటీడీ విజిలెన్స్, అటవీ, రెవెన్యూ, ఎక్సైజ్, అగ్నిమాపక, ఆరోగ్య శాఖలకు చెందిన 42 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెండు ప్రత్యేక బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహించిన అధికారులు మొత్తం 62 షాపులను పరిశీలించారు.

తనిఖీల సమయంలో సరైన గుర్తింపు పత్రాలు లేని 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అదేవిధంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 8 వ్యాపార కేంద్రాలను గుర్తించారు. మరో 34 మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించి రికార్డులను పరిశీలించారు.

వ్యాపారులు, కార్మికులకు గంజాయి, మద్యం, పొగాకు ఉత్పత్తుల వినియోగంపై కఠిన హెచ్చరికలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని, వస్తువులను ఎంఆర్పీ ధరలకే విక్రయించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ అధికారులు గడువు ముగిసిన శీతల పానీయాలను విక్రయిస్తున్న మూడు షాపులను గుర్తించి చర్యలు చేపట్టారు.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగంగా యువత, కార్మికులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వివరించి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 మరియు 1972 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని అవగాహన కల్పించారు.

భక్తుల భద్రత, తిరుమల పవిత్రతకు ఎలాంటి భంగం కలగకుండా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. స్థానిక వ్యాపారులు కూడా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.
Back to top button