తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ.. గరుడునిపై భక్తులకు దివ్య దర్శనమిచ్చిన మలయప్పస్వామి

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి నిర్వహించిన పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ వేలాది మంది భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణలతో తిరుమల కొండంతా ఆధ్యాత్మిక పరవశ్యంలో మునిగిపోయింది.
పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించిన ఈ గరుడసేవలో స్వామివారు స్వర్ణాభరణాలతో అలంకరించబడి గరుత్మంతునిపై కొలువుదీరారు. ధగధగా మెరిసే గరుడవాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించిన స్వామివారి దివ్య మంగళ రూపాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
వేదఘోషలు, మంగళవాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య తిరుమాడ వీధుల్లో సాగిన ఈ మహోత్సవం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. మార్గమధ్యంలో భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారి కృపాకటాక్షాలను కోరుకున్నారు.

గరుడసేవ విశిష్టత
వైష్ణవ సంప్రదాయంలో గరుడసేవకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. పౌరాణికంగా 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడవాహన సేవను అత్యంత పవిత్రమైన ఉత్సవంగా భావిస్తారు. గరుత్మంతుడు మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రుడైన వాహనంగా మాత్రమే కాకుండా భక్తి, సేవా భావం, శరణాగతికి ప్రతీకగా కూడా నిలుస్తాడు.
ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం గరుడవాహనంపై దర్శనమిచ్చే స్వామివారిని భక్తిశ్రద్ధలతో సేవిస్తే సర్వపాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయని విశ్వసిస్తారు. గరుడసేవ ద్వారా భగవంతుడు తన భక్తుల పట్ల ఉన్న అపారమైన ప్రేమను, దాసానుదాస భావాన్ని చాటిచెబుతాడని పండితులు పేర్కొంటారు.

తిరుమలలో ప్రతి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ గరుడసేవకు దేశం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతుంటారు. ముఖ్యంగా శ్రీవారి గరుడసేవను దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని భావించి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారామ్, జేఈవో (ఆరోగ్యం & విద్య) డాక్టర్ శరత్, ఇతర టీటీడీ అధికారులు, అర్చకులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





