ముంబైలో ఫేక్ పోస్టుపై పోలీసుల చర్య.. గరీబ్ నగర్ ఘటనపై తప్పుడు ప్రచారం చేసిన ఎక్స్ యూజర్‌పై కేసు

ముంబైలో గరీబ్ నగర్ కూల్చివేత చర్యల సందర్భంగా 13 మంది మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుపై ముంబై పోలీసులు స్పందించారు. ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారం అని స్పష్టం చేస్తూ, దానిని సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో షేర్ చేసిన యూజర్‌పై కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, బాంద్రా ఈస్ట్‌లోని గరీబ్ నగర్ ప్రాంతంలో ఇటీవల జరిగిన కూల్చివేత చర్యల సమయంలో పోలీసుల లాఠీచార్జ్‌లో 13 మంది చనిపోయారని, పలువురు గాయపడ్డారని పేర్కొంటూ ఓ పోస్టు వైరల్ అయింది. ఈ పోస్టుతో పాటు జనాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు.

అయితే ఈ సమాచారం పూర్తిగా అసత్యమని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, సామాజిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు భంగం కలిగించే ఉద్దేశంతో ఈ పోస్టును వైరల్ చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు.

కూల్చివేత చర్యల సమయంలో సుమారు 100 నుంచి 150 మంది గుంపుగా చేరుకుని రాళ్లు రువ్వడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎలాంటి మరణాలు సంభవించలేదని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై ముంబై బాంద్రా వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైరల్ పోస్టు చేసిన X ఖాతాదారుతో పాటు వీడియో రికార్డ్ చేసిన వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని ముంబై పోలీసులు ప్రజలకు సూచించారు. ధృవీకరించని సమాచారం, ఉద్రిక్తతలు రేకెత్తించే పోస్టులను షేర్ చేయడం చట్టపరంగా నేరమని హెచ్చరించారు.

మతపరమైన భావోద్వేగాలు దెబ్బతినేలా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button