భద్రాద్రిలో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం.. రూ.2 కోట్ల విలువైన 385 కేజీల స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఆపరేషన్లలో మొత్తం 385 కేజీల గంజాయి పట్టుబడగా, దాని విలువ సుమారు రూ.2 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీవో చెక్‌పోస్ట్ వద్ద అశ్వారావుపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు నుంచి రాజస్థాన్‌కు వెళ్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
తనిఖీల్లో ఒక కారు, ఒక లారీలో తరలిస్తున్న 300 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన మరో తనిఖీలో ఒడిశా నుంచి బెంగళూరుకు వెళ్తున్న కారులో 85 కేజీల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలో 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 212 గంజాయి కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుల్లో 15,398 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా, 677 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న గంజాయి మొత్తం విలువ సుమారు రూ.77 కోట్లుగా అంచనా వేశారు.
ఇప్పటివరకు ముగ్గురిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. అలాగే గంజాయి సేవిస్తున్న పది మందిని గుర్తించి డీ-అడిక్షన్ సెంటర్లకు తరలించినట్లు వెల్లడించారు.
ఎవరైనా గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఆపరేషన్లలో కీలకంగా పనిచేసిన టాస్క్ ఫోర్స్, అశ్వారావుపేట, లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.





