తిరుపతిలో సంచలనం.. మైనర్ బాలికపై దాడి కేసులో జీఎస్టీ ఉద్యోగి అరెస్ట్, పోక్సో కేసు నమోదు

తిరుపతిలో మైనర్ బాలికపై జరిగిన లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాలికను బెదిరిస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ శాఖ సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనను దాచిపెట్టేందుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని భార్యతో పాటు మరో మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు మైనర్ బాలికను బెదిరించి ఆమెపై పలుమార్లు దాడి చేసినట్లు విచారణలో తేలింది. విషయం బయటకు చెబితే ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, కుటుంబ సభ్యులకు హాని చేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వేధింపులు తట్టుకోలేక బాధితురాలు హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించగా, అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటన తిరుపతిలో జరిగినందున కేసును తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.
కేసు స్వీకరించిన తిరుపతి పోలీసులు నిందితుడు రామ్మూర్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారణలో నిందితుడిని కేసు నుంచి తప్పించేందుకు అతని భార్య, రైల్వే కోడూరు డిప్యూటీ తహసిల్దార్‌గా పనిచేస్తున్న మహిళ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే బాలికకు బంధువైన మానస అనే మహిళ కూడా ఈ వ్యవహారంలో సహకరించినట్లు తేలడంతో ఆమెను కూడా అరెస్ట్ చేశారు.
నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అధికారిణి పాత్రపై ప్రత్యేకంగా విచారణ కొనసాగుతోందని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి డీఎస్పీ భక్తవత్సలము మీడియాకు వెల్లడించారు. మైనర్ పిల్లలపై జరిగే వేధింపులు, లైంగిక నేరాలను దాచిపెట్టకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలకు సూచించారు.
బాధితుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటారని డీఎస్పీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటన తిరుపతిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.





