తిరుమలలో గురువారం భారీ రికార్డు.. 79 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించిన టీటీడీ

వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతున్నప్పటికీ సామాన్య భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ సమర్థవంతంగా దర్శన ఏర్పాట్లు నిర్వహిస్తోందని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. గురువారం తిరుమలలో రికార్డు స్థాయిలో 79 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయం వద్ద మీడియాతో మాట్లాడిన అదనపు ఈవో, ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేస్తున్నామని తెలిపారు. అదే సమయంలో టైమ్ మేనేజ్‌మెంట్‌, క్యూలైన్ల పర్యవేక్షణ, భక్తుల రాకపోకలపై నిరంతర మానిటరింగ్ నిర్వహించడం వల్ల దర్శన ప్రక్రియ వేగవంతమైందన్నారు.

ప్రతిరోజూ సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 15 వేల మందికిపైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని వెల్లడించారు. ముఖ్యంగా శ్రీవారి అభిషేక సేవ సమయంలో కూడా ఐదు వేల మంది సర్వదర్శన భక్తులకు దర్శనం కల్పించడం ద్వారా సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.

సాధారణంగా గురువారం వారపు కైంకర్యాల కారణంగా దర్శన సమయం పరిమితంగా ఉంటుందని, అయినప్పటికీ తొలిసారి 79 వేల మందికి దర్శనం కల్పించడం టీటీడీ సమన్వయ సామర్థ్యానికి నిదర్శనమని చెప్పారు. ప్రతి గంటకు క్యూలైన్ల పరిస్థితిని ఉన్నతాధికారులు సమీక్షిస్తూ అవసరమైన నిర్ణయాలను వెంటనే అమలు చేయడం వల్ల రద్దీ నియంత్రణ సులభమైందన్నారు.

వేసవి రద్దీ నిర్వహణలో టీటీడీ విభాగాలు, విజిలెన్స్‌, పోలీసు శాఖల మధ్య సమన్వయం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, వైద్య సేవలు, క్యూలైన్లలో అవసరమైన సౌకర్యాలు నిరంతరాయంగా అందేలా అన్ని విభాగాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.

సామాన్య భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే టీటీడీ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button