టీటీడీ ఎస్వీ గోశాలలో ఆధునిక నెయ్యి తయారీ కేంద్రం.. రోజుకు 80 కిలోల ఉత్పత్తి లక్ష్యం

తిరుపతిలోని టీటీడీ ఎస్వీ గోశాలలో నిర్మాణంలో కొనసాగుతున్న ఆధునిక నెయ్యి తయారీ కేంద్రం మరియు సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పనులను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, పెండింగ్ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
టీటీడీ ఈవో శ్రీ ఎం. రవిచంద్ర మార్గదర్శకత్వంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా స్వామివారి సేవలకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి వంటి పాలు ఆధారిత ఉత్పత్తులను టీటీడీ స్వయంగా తయారు చేయాలనే లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని జేఈవో తెలిపారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో నిర్మాణంలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పనులు, అలాగే చివరి దశకు చేరుకున్న నెయ్యి తయారీ కేంద్రం పనులను జూలై నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎస్వీ గోశాలలో రోజుకు సుమారు 2 వేల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యంతో ఈ యూనిట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. గోశాలలో సేకరించే పాలను పూర్తిస్థాయిలో వినియోగించి, శ్రీవారికి నిర్వహించే ధూప, దీప, నైవేద్య కార్యక్రమాల కోసం అవసరమైన నెయ్యిని స్థానికంగానే ఉత్పత్తి చేసే విధంగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఇప్పటికే నెయ్యి తయారీ ప్లాంట్ పనులు దాదాపు 90 శాతం పూర్తయ్యాయని, వెంటనే ట్రయల్ రన్ నిర్వహించి మిగిలిన పనులను పూర్తి చేయాలని సూచించారు. అలాగే దేశీయ ఆవుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, నీరు, విద్యుత్, ఫ్యాన్లు, లైటింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సైన్ బోర్డులు వంటి మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్‌లో మజ్జిగ, వెన్న తయారీ అనంతరం వెన్న నుంచి నెయ్యి ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జేఈవో సూచించారు. భవిష్యత్తులో ఈ యూనిట్ సామర్థ్యాన్ని దశలవారీగా 10 వేల లీటర్ల వరకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రోజుకు 2 వేల లీటర్ల పాలతో సుమారు 80 కిలోల నెయ్యి తయారు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో టిటిడి ఎస్వీ గోశాల డైరెక్టర్ డా. ఏవీఎన్ శివకుమార్, ఎస్‌ఈలు శ్రీ వేంకటేశ్వర్లు, శ్రీ మనోహరం, ఈఈ శ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





