82వ రోజుకు చేరిన స్విమ్స్ కార్మికుల పోరాటం.. మే 22 నుంచి నిరవధిక దీక్షలకు సిద్ధం

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి కార్మికుల పోరాటం రోజురోజుకు ఉధృతమవుతోంది. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళన నేటికి 82వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో మే 22 నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు స్విమ్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రకటించారు.
ఈ మేరకు స్విమ్స్ కార్మికుల దీక్షా శిబిరం వద్ద నిరవధిక నిరాహార దీక్షలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వర్కర్స్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. వేణుగోపాల్, యూనియన్ కార్యదర్శి జి. రవి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్విమ్స్‌లో సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను ‘వార్డు బాయ్’ విధుల్లో ఉపయోగించుకుంటున్నప్పటికీ వారికి తగిన హోదా, వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆరోపించారు.
శానిటేషన్ సిబ్బంది పేరుతో తక్కువ వేతనాలు చెల్లిస్తూ కార్మికులతో అధిక పనులు చేయించుకుంటున్నారని విమర్శించారు. కార్మిక శాఖ సమక్షంలో ఇచ్చిన హామీలను కూడా అధికారులు అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు.
గత 82 రోజులుగా మండుటెండల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై అధికారులు పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు.
పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా, చర్చలు జరిపినా సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీంతో పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
స్విమ్స్ కార్మికులకు ‘శానిటేషన్’ హోదా బదులుగా ‘వార్డు బాయ్’ హోదా కల్పించాలని, వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం, స్విమ్స్ యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే మే 22 నుంచి చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వి. సూరి, మారి ముత్తు, కోటయ్య, మునికృష్ణ, మునేంద్ర తదితరులు పాల్గొన్నారు.





