ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం కీలక ప్రకటన.. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచన

దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఇటీవల నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున పెరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ సరఫరాపై పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని ప్రకటించింది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజ వాయువుల నిల్వలు తగినంతగా ఉన్నాయని తెలిపింది. సరఫరా వ్యవస్థ పూర్తిగా సాధారణంగానే కొనసాగుతోందని పేర్కొంది.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మాట్లాడుతూ ఎల్పీజీ పంపిణీదారులు, పెట్రోల్ బంకులు, వినియోగదారులు భయాందోళనలకు గురై అధికంగా కొనుగోళ్లు చేయాల్సిన అవసరం లేదన్నారు. అవసరానికి మించిన ఇంధన కొనుగోళ్లు చేయడం వల్ల సరఫరా వ్యవస్థపై అనవసర ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

దేశంలో అన్ని రకాల ఇంధనాల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరా యథావిధిగా కొనసాగుతోందని స్పష్టం చేశారు.
అంతేకాకుండా భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని పెంచేందుకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహక చర్యలు చేపడుతోందని వెల్లడించారు. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG), ఇండక్షన్ స్టౌవ్‌లు, ఎలక్ట్రిక్ కుక్‌టాప్‌ల వంటి ప్రత్యామ్నాయ వంట విధానాలను ప్రజలు ఎక్కువగా వినియోగించాలని సూచించారు.
ఇంధన సరఫరాపై ఎలాంటి అపోహలు నమ్మవద్దని, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.





