89.40% పచ్చదనంతో కళకళలాడుతున్న శేషాచలం.. అటవీ సంరక్షణలో దేశానికే ఆదర్శంగా టీటీడీ

తిరుమల శేషాచల కొండలు 89.40 శాతం పచ్చదనంతో కళకళలాడుతున్నాయని టీటీడీ వెల్లడించింది. అరణ్య సంపద పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, పర్యావరణ సమతుల్యత కాపాడటంలో టీటీడీ అటవీ శాఖ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొంది.

టీటీడీ అటవీ శాఖ 1980 సంవత్సరం నుండి శేషాచల అరణ్యాలను పరిరక్షిస్తూ పర్యావరణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత శ్రేణుల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తోంది.

టీటీడీ అటవీ విభాగ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల విస్తీర్ణంలో అరణ్య ప్రాంతం ఉంది. తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ISFR) ప్రకారం ఇందులో 89.40 శాతం మేర అటవీ విస్తీర్ణం నమోదైంది. సుమారు 2431 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉండటం విశేషం. ఈ అటవీ ప్రాంతాలు కార్బన్ నిల్వలు, వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణకు ప్రధాన ఆధారంగా నిలుస్తున్నాయి.

టీటీడీ అటవీ విభాగాన్ని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తిరుమలలో రెండు, తిరుపతిలో రెండు కలిపి మొత్తం నాలుగు ఫారెస్ట్ రేంజ్‌లు ఉన్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు సమన్వయంతో అటవీ సంరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు.

అటవీ సంపద రక్షణ కోసం 24 గంటల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పహారా నిర్వహిస్తున్నాయి. అక్రమ చెట్ల నరికివేత, వేట చర్యలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. అటవీ అగ్నిప్రమాదాల నివారణకు ప్రతి సంవత్సరం 26.5 లక్షల చదరపు మీటర్ల మేర ఫైర్ లైన్లు నిర్వహిస్తున్నారు. శిక్షణ పొందిన బృందాలు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి అగ్నిమాపక చర్యలు చేపడుతున్నాయి.

జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా విదేశీ జాతికి చెందిన అకేషియా చెట్ల స్థానంలో స్థానిక వృక్ష సంపదను పునరుద్ధరించే కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. ఈ క్రమంలో 576 హెక్టార్లలో రావి, మర్రి, జువ్వి, మేడి, సంపంగి, మామిడి, గంధం, ఎర్రచందనం, ఉసిరి, నేరేడు వంటి స్వదేశీ మొక్కలను నాటుతున్నారు. ఇప్పటికే 22 హెక్టార్లలో పనులు పూర్తయ్యాయి.

టీటీడీ పరిధిలోని నాలుగు ఫారెస్ట్ రేంజ్‌లలో ప్రత్యేక నర్సరీలను నిర్వహిస్తూ స్థానిక, ఔషధ, అలంకార మొక్కలను పెంచుతున్నారు. అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలకు అవసరమైన నాణ్యమైన మొక్కలను ఈ నర్సరీల ద్వారా సరఫరా చేస్తున్నారు.

శేషాచల అడవుల్లో ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు, పాములు వంటి అనేక వన్యప్రాణులు నివసిస్తున్నాయి. మానవ-వన్యప్రాణి ఘర్షణలు తగ్గించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వేసవి కాలంలో జంతువుల దాహార్తి తీర్చేందుకు అడవుల్లో ప్రత్యేక నీటి గుంతలు ఏర్పాటు చేసి నీటిని నింపుతున్నారు. దీంతో అడవి జంతువులు మానవ నివాస ప్రాంతాల్లోకి వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయి.

భక్తుల భద్రత దృష్ట్యా ప్రమాదకరమైన చెట్ల తొలగింపు, రహదారుల పక్కన చెట్ల కొమ్మల కత్తిరింపు, గాలివానలతో కూలిన చెట్ల తొలగింపు వంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నారు. దర్శన క్యూ లైన్ ప్రాంతాల్లో మూడు స్నేక్ రెస్క్యూ బృందాలను అప్రమత్తంగా ఉంచుతున్నారు.

అలాగే తిరుమల, తిరుపతిలోని ఆలయాల కోసం శ్రీగంధం చెక్కలు, వంట చెరుకు, దర్భ గడ్డి వంటి పూజా సామగ్రిని టీటీడీ అటవీ శాఖ సమకూరుస్తోంది. రహదారి డివైడర్లు, ఉద్యానవనాలు, పచ్చదన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. మొత్తం 24 కిలోమీటర్ల మేర రహదారి డివైడర్లు, 25 ఉద్యానవనాలను సంరక్షిస్తోంది.

అరుదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కల పరిరక్షణపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆయుర్వేద ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తోంది.

ప్రస్తుతం పవిత్ర వనం, దివ్య ఔషధ వనం, పాలమనేరు టింబర్ ప్లాంటేషన్, వన్యప్రాణి ఘర్షణల నివారణ ప్రాజెక్టులు, కొండల పచ్చదనం పెంపు కార్యక్రమాలను టీటీడీ అటవీ శాఖ అమలు చేస్తోంది. భవిష్యత్ తరాలకు ప్రకృతి వారసత్వాన్ని అందించడమే టీటీడీ అటవీ శాఖ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button