నెల్లూరులో లాడ్జిలపై పోలీసుల కఠిన నిఘా.. 226 మంది సిబ్బందితో భారీ నాకాబంది

నెల్లూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు రాత్రి వేళల్లో వాహన తనిఖీలు, లాడ్జి చెకింగ్స్‌ను మరింత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా IPL బెట్టింగ్, గంజాయి వినియోగం, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు.

అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) పర్యవేక్షణలో మే 22 రాత్రి 9.30 గంటల నుంచి 11 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా భారీ నాకాబంది నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 226 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లాలోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, హైవేలు, ప్రవేశ-నిష్క్రమణ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహించాయి. లాడ్జిల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టి మొత్తం 87 లాడ్జిల్లో చెకింగ్స్ చేపట్టారు.

వాహన తనిఖీల్లో భాగంగా ఓపెన్ డ్రింకింగ్‌కు సంబంధించి 30 కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 19 కేసులు నమోదు కాగా, మోటార్ వెహికిల్స్ చట్టం కింద 513 కేసులు నమోదు చేసి మొత్తం రూ.1,47,680 జరిమానాలు విధించారు.

రాత్రి వేళల్లో వాహన తనిఖీలను మరింత బలోపేతం చేసి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. లాడ్జి చెకింగ్స్ ద్వారా అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచుతున్నట్లు పోలీసులు తెలిపారు.

అదేవిధంగా క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ఓపెన్ డ్రింకింగ్, గంజాయి వినియోగం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, దొంగతనాల వంటి నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

అంతర్జిల్లా సమన్వయంతో సమాచార మార్పిడి చేస్తూ జిల్లా సరిహద్దుల్లో కూడా కట్టుదిట్టమైన వాహన తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్, డయల్ 100/112 లేదా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button