మహిళల భద్రతపై తిరుపతి పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం.

మహిళల భద్రత, సాధికారత సమాజ అభివృద్ధికి కీలకమని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్‌. సుబ్బరాయుడు ఐపీఎస్ పేర్కొన్నారు. రేణిగుంట సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులమండ్యం ఆర్‌పీఆర్ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళ సాధికారత కేవలం నినాదం మాత్రమే కాదని, సమాజ నిర్మాణానికి అది బలమైన పునాదిగా నిలుస్తుందని తెలిపారు. మహిళలు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనతో ముందుకు వస్తే కుటుంబాలు మాత్రమే కాదు సమాజం కూడా మరింత సురక్షితంగా మారుతుందని పేర్కొన్నారు.

మహిళలు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. గృహ హింస, వేధింపులు, సైబర్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే నేరాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మహిళలు, చిన్నారులపై వేధింపులకు పాల్పడే వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మొదటి తప్పుకే రౌడీషీట్ నమోదు చేసి, మళ్లీ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్‌లైన్ మోసాలు, డ్రగ్స్ వినియోగం వంటి అంశాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత మొబైల్ వినియోగాన్ని నియంత్రణలో ఉంచి విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.

అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ‘శక్తి’ యాప్‌, డయల్-112, మహిళా హెల్ప్‌లైన్-181, సైబర్ హెల్ప్‌లైన్-1930, చైల్డ్‌లైన్-1098 సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

సమాజంలో జరిగే తప్పులను చూసి మౌనంగా ఉండకుండా ప్రజలు పోలీసులకు సమాచారం అందిస్తేనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని ఎస్పీ తెలిపారు. మహిళల భద్రత, యువత భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీమతి శ్రీలత, ఎస్‌బీ డీఎస్పీ గీతా కుమారి, పోలీస్ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button