తిరుమలలో భారీ భక్తుల రద్దీ.. క్యూలైన్లు, ట్రాఫిక్‌పై టీటీడీ-పోలీసుల ప్రత్యేక చర్యలు

వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భారీగా పెరుగుతున్న భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు టీటీడీ, పోలీస్ శాఖలు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని క్యూలైన్లు, ట్రాఫిక్ నిర్వహణ, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను సంయుక్తంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు ఈవో స్వయంగా భక్తులతో మాట్లాడి టీటీడీ అందిస్తున్న సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం క్యూలైన్లలో భక్తులకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ, తాగునీటి ఏర్పాట్లను పరిశీలించారు.

మీడియాతో మాట్లాడిన అదనపు ఈవో, భక్తుల రద్దీ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్‌, ఇతర విభాగాలు సమన్వయంతో 24 గంటల పాటు సేవలు అందిస్తున్నాయని చెప్పారు.

క్యూలైన్లలో భక్తులను క్రమబద్ధంగా పంపిస్తూ తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడకుండా సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు.

శుక్రవారం భారీ సంఖ్యలో వాహనాలు తిరుమలకు వచ్చినప్పటికీ ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని అధికారులు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలో 320కు పైగా ఉచిత బస్సులు నడుస్తుండగా, అదనంగా ఏపీఎస్‌ఆర్టీసీ మరో 100కుపైగా ట్రిప్పులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

భక్తులకు రోజుకు నాలుగు లక్షల మందికి సరిపడా అన్నప్రసాదాలు సిద్ధం చేస్తున్నామని, 45 వేల లీటర్ల మజ్జిగ, 50 వేల లీటర్ల పాలను అందిస్తున్నామని తెలిపారు. మొబైల్ టీమ్స్‌, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా అన్ని విభాగాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేశామని చెప్పారు.

క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు అన్నమాచార్య కీర్తనలు, శ్రీవారి మహత్యాన్ని నిరంతరం ప్రసారం చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, సమస్యలు ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, మే నెల ప్రారంభం నుంచే భారీ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్‌, బస్ స్టాండ్‌, అలిపిరి, శ్రీవారి మెట్లు, వసతి కేంద్రాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు.

ప్రస్తుతం రోజుకు సుమారు 16 వేల వాహనాలు తిరుమలకు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button