బస్సులో ప్రేమజంట హంగామా.. స్లీపర్ సీట్ల వివాదం డ్రైవర్‌పై దాడికి దారి


ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ప్రేమజంట వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో స్లీపర్ సీట్ల బుకింగ్‌పై ప్రారంభమైన చిన్నపాటి వాగ్వాదం, చివరకు డ్రైవర్‌పై దాడి వరకు వెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి స్థానికంగా చర్చనీయాంశమైంది.

హైదరాబాద్‌లో నివసిస్తున్న యువకుడు, యువతి మచిలీపట్నం వెళ్లేందుకు ప్రైవేట్ బస్సులో ముందుగానే రెండు స్లీపర్ సీట్లు బుక్ చేసుకున్నారు. అయితే ఆ సీట్లు ఇద్దరు యువతుల పేర్లతో రిజర్వ్ చేసినట్టు సమాచారం. ప్రయాణం ప్రారంభమైన తర్వాత డ్రైవర్ ఐడి వివరాలు పరిశీలించగా, బుకింగ్‌లో ఉన్న పేర్లకు ప్రయాణిస్తున్న వ్యక్తులు సరిపోలకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేశాడు.

కంపెనీ నిబంధనల ప్రకారం అనుమతించలేనని డ్రైవర్ చెప్పడంతో బస్సులో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది.

అయితే ప్రయాణం ముగింపు దశలో మళ్లీ వివాదం తలెత్తింది. మచిలీపట్నం బస్టాండ్ సమీపంలో దిగిన తర్వాత కూడా ఈ అంశంపై ఉద్రిక్తత కొనసాగింది. చిలకలపూడి సెంటర్ వద్ద యువకుడు డ్రైవర్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్లీపర్ సీట్ల బుకింగ్ విషయంలో జరిగిన ఈ వివాదం ఇప్పుడు స్థానికంగా చర్చకు దారి తీసింది.

Post a Comment

Previous Post Next Post