ఫిబ్రవరి 18, 2026: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం ఉదయం, స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై ఆలయ ప్రాంగణంలో శోభాయాత్రగా విహరించి భక్తులకు దివ్య దర్శనం అందించారు.
మంగళ వాయిద్యాల నాదం, కోలాటాలు, భక్తుల హర్షధ్వానాలు, సాంప్రదాయ కళాప్రదర్శనల నడుమ వాహనసేవ ఎంతో భక్తిరసభరితంగా సాగింది. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి.
చిన్నశేష వాహన ప్రాధాన్యం – కుటుంబ శ్రేయస్సుకు సంకేతం
చిన్నశేషుడిని నాగలోకాధిపతి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం, భగవంతుడు “శేషి”, జగత్తు “శేషభూతం”. ఈ తత్త్వాన్ని సూచించేది శేషవాహనం.
చిన్నశేష వాహన సేవను దర్శించేవారికి కుటుంబ శ్రేయస్సు కలగడమే కాకుండా కుండలినీ యోగ సిద్ధి ఫలితం కూడా లభిస్తుందని విశ్వాసం ఉంది. అందుకే ఈ వాహనసేవకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది.
రాత్రి హంస వాహనసేవ
ఈరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సేవను కూడా విశేషంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పాల్గొన్న అధికారులు
ఈ వాహనసేవలో ఆలయ అర్చకులు, ఏఈవో శ్రీ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ నిరంజన్, శ్రీ హరికృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కటాక్షాన్ని పొందారు.

Post a Comment