అలిపిరిలో దివ్య హోమానికి భక్తుల భారీ స్పందన.. హోమంలో పాల్గొనేవారికి శ్రీవారి ప్రత్యేక దర్శనం!

హిందూ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం”కు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అలిపిరి సప్త గోప్రదక్షిణ మండపంలో ప్రతిరోజూ వేదఘోషల నడుమ ఈ దివ్య హోమం వైభవంగా కొనసాగుతోంది.

టీటీడీ 2023 నవంబర్ 23న ప్రారంభించిన ఈ హోమ కార్యక్రమం భక్తుల సంకల్పాలను భగవంతుని సన్నిధికి చేర్చే పవిత్ర వేదికగా నిలుస్తోంది. ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహిస్తున్నారు.

భక్తుల నుంచి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 2025 ఆగస్టు 1 నుంచి రోజుకు 200 టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకురానుంది. టికెట్ పొందిన గృహస్తులు స్వయంగా హాజరై హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది.

ఇక భక్తులకు మరింత సౌకర్యంగా ఉండేందుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు రూ.7 కోట్ల వ్యయంతో భారీ శాశ్వత యాగశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 500 మంది గృహస్తులు ఒకేసారి పాల్గొనేలా ఈ యాగశాల నిర్మాణం చేపడుతున్నారు.

టీటీడీ ఇప్పటికే శ్రీనివాస కళ్యాణాలు, వైభవోత్సవాలు, ఎస్వీబీసీ ప్రసారాలు, భజన బృందాలు, అన్నమాచార్య సంకీర్తన ప్రచారం వంటి అనేక ధార్మిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ దివ్యానుగ్రహ విశేష హోమం కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో భక్తులు ఈ హోమంలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందవచ్చని టీటీడీ తెలిపింది. రూ.1600 టికెట్‌తో ఇద్దరు గృహస్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. హోమంలో పాల్గొన్న వారికి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా కల్పిస్తున్నారు.

భక్తులు టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నెల రోజుల ముందుగానే బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వేద మంత్రాల శక్తితో భగవంతుని అనుగ్రహం త్వరగా లభిస్తుందని అర్చకులు తెలిపారు.

Tirupati Times

Tirupati Times brings you latest Telugu news updates from Andhra Pradesh, Telangana, Politics, Cinema, Crime, Devotional, Viral and Breaking News with fast and reliable coverage.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button