
గుంటూరులో సిద్ధమైన ఎయిర్ ట్యాక్సీ.. త్వరలో గాల్లో ప్రయాణాలకు కొత్త దారి
భారతదేశంలో భవిష్యత్ రవాణా రంగానికి కొత్త దిశగా ఎయిర్ ట్యాక్సీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరును కేంద్రంగా చేసుకుని అభివృద్ధి చేస్తున్న ఎయిర్ ట్యాక్సీ ప్రాజెక్ట్ ఇప్పుడు టెక్నాలజీ రంగంలో చర్చనీయాంశంగా మారింది.
మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ ఎయిర్ ట్యాక్సీలు నగరాల్లో ట్రాఫిక్ సమస్యలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభ దశలో రెండు సీట్ల సామర్థ్యంతో రూపొందించిన ఈ ఎయిర్ ట్యాక్సీ ఇప్పటికే పలు సాంకేతిక పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం.
ప్రాజెక్ట్ నిర్వాహకుల ప్రకారం, భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ఎయిర్ ట్యాక్సీని డిజైన్ చేశారు. అధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము, గాలివానల వంటి పరిస్థితులను తట్టుకునేలా ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని హార్డ్ ల్యాండింగ్, స్ట్రక్చరల్ స్ట్రెస్ వంటి అనేక పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అనుమతులు మరియు పాలసీ మార్గదర్శకాల కోసం సంస్థ ఎదురుచూస్తోంది. అనుమతులు లభించిన వెంటనే వాణిజ్య సేవలను ప్రారంభించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు వంటి మహానగరాల్లో ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోడ్డు ట్రాఫిక్‌ను తగ్గించడంతో పాటు వేగవంతమైన ప్రయాణ సదుపాయాన్ని అందించడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా పేర్కొంటున్నారు.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో ఉపయోగిస్తున్న పరికరాల్లో ఎక్కువ భాగం దేశీయంగా తయారవుతుండటం మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ రవాణా రంగంలో కీలక మార్పులకు దారితీయవచ్చని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


