మహారాష్ట్రలో విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు భక్తుల మృతి

మహారాష్ట్ర రాష్ట్రంలోని సంగ్లీ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. జత్ తాలూకా పరిధిలోని మోతేవాడి గ్రామంలో మార్గుదేవి ఆలయం వద్ద నిర్వహిస్తున్న మతపరమైన కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఇదే సమయంలో ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి.

వర్షం నుంచి తప్పించుకునేందుకు భక్తులు సమీపంలోని రేకుల షెడ్డు కిందకు వెళ్లారు. అయితే ఈదురుగాలుల తీవ్రత ఎక్కువ కావడంతో టిన్ షీట్లు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టాయి. దీంతో గోడ ఒక్కసారిగా కూలిపోయి అక్కడ ఆశ్రయం పొందిన భక్తులపై పడింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 15 మంది వరకు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button