ఏపీలో ప్రేమ జంటకు సామాజిక బహిష్కరణ.. గ్రామ పెద్దల తీర్పుతో కుటుంబం ఆందోళన

ఆంధ్రప్రదేశ్లో ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంటను, వారి కుటుంబాన్ని గ్రామ పెద్దలు సామాజికంగా వెలివేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారం స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీసింది.
గ్రామానికి చెందిన తేజ, నాగలక్ష్మి పరస్పరం ప్రేమించి వివాహం చేసుకోవడంతో గ్రామ పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వివాహాన్ని అంగీకరించని కొందరు కుల పెద్దలు, ఆ జంట కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలని నిర్ణయించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
వారితో గ్రామస్తులు ఎవరూ మాట్లాడకూడదని, వారి ఇళ్లకు వెళ్లరాదని, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననివ్వకూడదని గ్రామంలో చాటింపులు చేసినట్లు సమాచారం. గ్రామ పెద్దల నిర్ణయాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తే రూ.2 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు కూడా బాధిత కుటుంబం చెబుతోంది.
ఈ పరిణామాల కారణంగా గ్రామ ప్రజలు కూడా ఆ కుటుంబానికి దూరంగా ఉంటున్నారని బాధితులు వాపోతున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో తేజ, నాగలక్ష్మి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయినట్లు తెలిసింది. అయితే అమ్మాయి కుటుంబం మాత్రం ఇంకా గ్రామంలో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సమాచారం.
ఇటీవల ఆ జంటకు బాబు పుట్టడంతో కుటుంబ సభ్యులు బారసాల కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు గ్రామస్తులు ఎవరూ హాజరుకావద్దని గ్రామ పెద్దలు మరోసారి హెచ్చరికలు జారీ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బారసాలకు ఆహ్వానించేందుకు గ్రామంలోకి వెళ్లిన కుటుంబ సభ్యులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, గ్రామ తీర్పును ఉల్లంఘించారని పేర్కొంటూ రూ.2 లక్షల జరిమానా విధించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై బాధిత కుటుంబం మైలవరం పోలీసులను ఆశ్రయించినప్పటికీ సరైన స్పందన లభించలేదని ఆరోపిస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ జోక్యం చేసుకుని తమకు రక్షణ కల్పించాలని, న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇక ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, సామాజిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రేమ వివాహం కారణంగా ఒక కుటుంబాన్ని సామాజికంగా వెలివేయడం అనాగరిక చర్య అని పలువురు అభిప్రాయపడుతున్నారు.





